గురుకుల పాఠశాలలో దోమతెరల పంపిణి.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : జాతీయ కీటక జినిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా (ఎన్. వి.బి.డి.సి.పి) దోమల బారినుండి విద్యార్థులకు రక్షణ వలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దోమతెరలను పంపిణీ చేస్తుందని జిల్లా మలేరియా అధికారి ఎం.సింహాచలం తెలిపారు. బుధవారం ముత్తుకూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని 640 మంది విద్యార్థినులకు దోమతెరలు పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దోమతెరలు తయారీ విధానంలో మెడికేటెడ్ దారం వాడినందువలన దీనిపైన దోమ వాలదు. ఈ దోమతెరలు చాలా కాలము మన్నికగాఉపయోగపడతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 185 హాస్టల్స్ లో 9475 దోమతెరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దోమల వలన వచ్చే వ్యాధుల నుంచి ఆరోగ్య భద్రత కొరకు తప్పకుండా దోమతెరలను వాడాలని సూచించారు. దీనివలన దోమలు కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు మెదడు వాపు వంటి వ్యాధులను అరికట్టేందుకు దోహదం చేస్తుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ఉధృతి తగ్గుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధులు విభాగము దోమలు పుట్టకూడదు దోమల కుట్టకూడదు అనే నినాదంతో విస్తృత కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ యు ఓ సుధాకర రెడ్డి, స్థానిక వైద్యాధికారులు సి.దేవికృప,సిహెచ్ చైతన్య రెడ్డి, ప్రిన్సిపాల్ సుజాత, ఆరోగ్య సహాయకులు బూదూరు బాలకృష్ణ,విద్యా కమిటీ చైర్మన్ నక్కా శ్రీధర్ పాల్గొన్నారు.