గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ .
- విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా అదృష్టం, గౌరవం..
- ఎన్ని నిందారోపణలు చేసినా, సూర్యనారాయణ ఆశీస్సులు టీడీపీకే ఉంటాయి.
- తొలి వర్థంతి నాడు సభ నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తాం: ఎమ్మెల్యే గొండు శంకర్.
శ్రీకాకుళం నవంబర్ 12 మేజర్ న్యూస్ :
శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు గుండ అప్పలసూర్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం అరసవల్లి మిల్ జంక్షన్ వద్ద అత్యంత ఘనంగా జరిగింది. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై అప్పలసూర్యనారాయణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. చిరస్మరణీయులు గుండ అప్పలసూర్యనారాయణ విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం దక్కడం తన అదృష్టంగా, గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల కోడ్ లేని ఈ మూడు రోజుల స్వల్ప వ్యవధిలో, రాబోయే మున్సిపల్ ఎన్నికల కోడ్ దృష్ట్యా అత్యవసరంగా విగ్రహావిష్కరణ చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. రాబోయే ఆయన మొదటి వర్ధంతి రోజున మంచి సభ ఏర్పాటు చేసి, ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తామని స్పష్టం చేశారు.
అప్పలసూర్యనారాయణ పరమపదించిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలించిపోయి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఓదార్చారని గుర్తుచేశారు. ఆయన ఆదేశాల మేరకు మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు గార్లు, కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో పూర్తి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. సంతాప సభ నాడే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తాను ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు.
విగ్రహ ఏర్పాటుపై కొందరు పనిగట్టుకుని ఎన్ని సందేహాలు సృష్టించినా, నిందారోపణలు చేసినా, కల్లబొల్లి మాటలు మాట్లాడినా ఆ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దయ, అప్పలసూర్యనారాయణ గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి, తనకు ఉంటాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ఆశయాలు తనకు పూర్తిగా తెలుసని, భవిష్యత్తులో మరిన్ని విషయాలను ప్రజల ముందుంచుతానని అన్నారు. చివరగా 'జోహార్ గుండ అప్పలసూర్యనారాయణ గారు.. అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ మాదరపు వెంకటేష్ పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మూకాళ్ళ శ్రీనివాస్, గార మండల అధ్యక్షులు లోపింటి రాధాకృష్ణ రెడ్డి, సింతు సుధాకర్, పి యం జె బాబు, పొట్నూరు కృష్ణమూర్తి, రమణ మాదిగ, ఉంగటి రమణ, రాయపల్లి అర్జున్, తెలుగు నాగరత్నం, దండ్యసి జ్యోతి భాస్కర్, తెలుగు జగదీష్, ఉంగటి రామ్మోహన్, కూటమి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అప్పలసూర్యనారాయణ గారి అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.