గ్రంథాలయం అనే పునాదిపై విద్యార్థుల భవిష్యత్తును నిర్మించుకోవాలి *డాక్టర్ సలాది శ్రీ రాజేశ్వరి
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని శ్రీ ఇనపకోళ్ల రాఘవరావు మెమోరియల్ శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 16వ తేదీ సోమవారం విద్యార్థులు, పాఠకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ పితామహుడు శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు, వక్తలు విద్యార్థులకు పుస్తక పఠనం, విద్య, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ సలాది శ్రీరాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ దాగి ఉంటుందని, ఎవరూ తక్కువ కాదని అన్నారు. కష్టపడి చదివి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆశించిన ఫలితాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ పట్టుదలతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.జిల్లా విజిలెన్స్ సభ్యులు, వశిష్ట వినియోగదారుల సంఘం అధ్యక్షులు సలాది ఉదయభాస్కరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడుపుతూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. విజ్ఞానం, ప్రతిభకు గ్రంథాలయమే పునాది అని, గ్రంథాలయం అనే పునాదిపై తమ భవిష్యత్తును నిర్మించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
హెల్త్ అసిస్టెంట్ సి.హెచ్. వెంకటపతి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.వీరవెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టపడి సాధించిన విజయాలు ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత కార్యదర్శి ముళ్లపూడి బుల్లచ్చన్న, సి.ఆర్.పి. రాజోలు శ్రీనివాస్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సలాది వీర వెంకట సూర్యనారాయణ, కరటూరి విశ్వనాథం, కొంపెల్ల పట్టాభిరామ మాస్టారు, రిసోర్స్ పర్సన్ ఎన్. పుష్పవతి, హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు కె. గంగాధరం తదితరులు పాల్గొన్నారు.గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. గ్రంథాలయాధికారి ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.