గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పక్కాగా పాటించాలి
మచిలీపట్నం, మేజర్ న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మంగళవారం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో స్టేజ్–1, స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి తుది పోటీదారుల జాబితా ప్రచురణ వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని, చెక్‌లిస్టు ప్రకారం అన్ని పత్రాలు, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ సమయంలో బ్యాలెట్ బాక్సుల పనితీరు, బ్యాలెట్ పత్రాల నాణ్యత, సీరియల్ క్రమాన్ని తనిఖీ చేయాలని, చిరిగిన లేదా దెబ్బతిన్న బ్యాలెట్ పత్రాలను స్వీకరించకూడదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూములు, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల గుర్తింపు కార్డులు, ఇతర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ సామగ్రితో బయలుదేరిన సిబ్బంది నేరుగా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు, డీఎల్డీవోలు ఎన్నికల హ్యాండ్‌బుక్ ప్రకారం ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ప్రతి అధికారి 100 శాతం అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిక్షణలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల విధివిధానాలను వివరించగా, అధికారుల సందేహాలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ, డీఎల్డీవో, డీఎల్పీఓ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.