గ్రామ ప్రజల నమ్మకమే మా గెలుపునకు బలం
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని తూర్పు కోడిగుడ్లపాడు గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేమని సర్పంచ్ మానం రాజేశ్వరి, ఆమె భర్త మానం మల్లికార్జున తెలిపారు. ఎన్నికల్లో తమకు అండగా నిలిచి, ఆదరించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజల మద్దతు కార్యకర్తల కృషి శ్రేయోభిలాషుల సహకారంతోనే 59 ఓట్లతో విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో తమకు సహకరించిన గ్రామ పెద్దలు మహిళలు యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఓటు వేసిన వారితో పాటు వేయని వారిని కూడా సమానంగా గౌరవిస్తూ గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.సర్పంచ్‌గా గ్రామానికి మరింత మెరుగైన సేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసుకుంటామని మానం రాజేశ్వరి, మానం మల్లికార్జున స్పష్టం చేశారు.