గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
కర్నూలు, మేజర్ న్యూస్: నామినేషన్, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ,అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.
బుధవారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులు (ROలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROలు) స్టేజ్–1 అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నామినేషన్ ల స్వీకరణ, పరిశీలన లో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సీసీటీవీ, వీడియోగ్రఫీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు మూడు నుంచి నాలుగు ప్రత్యేక కౌంటర్లు, అభ్యర్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద జనసందోహాన్ని నియంత్రించడంతో పాటు షామియానాలు, కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోలింగ్‌కు సంబంధించిన స్టాట్యూటరీ, నాన్స్టాట్యూటరీ మెటీరియల్, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, గ్రీన్ పేపర్ సీల్స్‌ను ముందుగానే తనిఖీ చేసుకోవాలన్నారు. పంపిణీ కేంద్రాల్లో తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేసేటప్పుడు అవసరమైన దానికంటే 20 శాతం అదనంగా ఆహారం సిద్ధం చేయాలన్నారు. టోకెన్ విధానం ద్వారా క్రమబద్ధంగా భోజనం పంపిణీ చేయాలని, ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
పోలింగ్ ముగింపు సమయానికి క్యూ లైన్లో ఉన్న చివరి ఓటరు వరకు ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఓటర్ల గుర్తింపునకు ఎన్నికల సంఘం సూచించిన ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని యాప్‌లో నమోదు చేయాలని, సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అవసరాన్ని బట్టి డబుల్ లేదా ట్రిపుల్ కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసి, మొదటి రౌండ్ నుంచే అత్యంత జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కౌంటింగ్ ప్రక్రియపై స్పష్టత కల్పించాలన్నారు. రీ-కౌంటింగ్ అభ్యర్థనలు వచ్చినప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సాయంత్రం 5 నుంచి 5.30 గంటలలోపు, సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్‌ను సాయంత్రం 6 గంటలలోపు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
ఎన్నికల విధుల్లో ROలదే కీలక బాధ్యత
ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు కీలక బాధ్యత వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సిబ్బంది విధులకు అందుబాటులో ఉండేలా చూడాలని, సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ తరగతుల నోడల్ అధికారి నరసింహారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.