పటాన్‌చెరు నుంచి ఈపీఎఫ్ కార్యాలయం తరలించొద్దు
పటాన్‌చెరు:పటాన్‌చెరు పట్టణంలోని ఈపీఎఫ్ కార్యాలయాన్ని తాత్కాలికంగా హైదరాబాద్‌లోని కొత్తగూడకు తరలించే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులను కోరారు. బుధవారం పలువురు కార్మికులు ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఈపీఎఫ్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.ప్రస్తుతం ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న కార్యాలయానికి సంబంధించి అద్దె ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు భవన యజమాని నిరాకరించడంతో, పటాన్‌చెరు బస్టాండ్‌లోని మూడో అంతస్తుకు కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించినట్లు కమిషనర్ ఎంపీకి వివరించారు. అయితే అక్కడ కార్యాలయానికి అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టేందుకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని, అందుకే అప్పటివరకు తాత్కాలికంగా కొత్తగూడకు తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు.దీనిపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం తరలింపు వంటి కీలక నిర్ణయం తీసుకునే ముందు స్థానిక ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కార్యాలయ తరలింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. భవన యజమానితో తాను మాట్లాడి మరో మూడు నెలల గడువు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.ఒక్కసారి ఈపీఎఫ్ కార్యాలయం హైదరాబాద్‌కు తరలిపోతే తిరిగి పటాన్‌చెరుకు వచ్చే అవకాశం ఉండదని, దీనివల్ల స్థానిక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యాలయ తరలింపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని,ఈ విషయంపై ఉన్నతాధికారులతో కూడా మాట్లాడతానని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు.