telangana
పాతనగరం కాదు.. 'ఒరిజినల్ సిటీ
పాతనగరం కాదు.. 'ఒరిజినల్ సిటీ
హైదరాబాద్: మైనార్టీ యువతలో ప్రతిభావంతులు, నైపుణ్యాలు కలిగిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం 'స్కిల్ యూనివర్సిటీ'ని అందుబాటులోకి తెచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరానికి గుండెకాయ వంటి ప్రాంతాన్ని 'ఓల్డ్ సిటీ' అనడం కంటే 'ఒరిజినల్ సిటీ' అని పిలవడమే సముచితమని, దానిని కాపాడుకునే సంపూర్ణ బాధ్యతను తానే తీసుకుంటానని పునరుద్ఘాటించారు.
ఇంతకాలం పాతబస్తీకి మెట్రో రైలు కనెక్టివిటీ ఎందుకు లేదో ఆలోచించాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రో మార్గం కోసం వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.
అలాగే ప్రతిష్టాత్మక 'మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి' ప్రాజెక్టును ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుపడినా, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ స్వరూపం మారడమే కాకుండా, స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ విస్తృత స్థాయిలో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. "ఈ ప్రభుత్వం మీది, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్యల పరిష్కారానికి ఒక్క దరఖాస్తు ఇస్తే చాలు, ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది" అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.