గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదిలో అద్భుత ఫలితాలు: పుష్కరాల నిధులపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు!
సూర్య న్యూఢిల్లీ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో రాష్ట్ర ప్రగతి, నీటిపారుదల ప్రాజెక్టులు, ఆర్థిక సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును వేగవంతం చేయాలని, 2027లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, సంబంధిత రాష్ట్రాలను సమన్వయం చేస్తూ గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్తే దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం వివరించారు. ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్, జాతీయ రహదారుల నెట్‌వర్క్ విజయవంతంగా ఏర్పాటైనట్లే.. నదుల అనుసంధానం ద్వారా జాతీయ 'వాటర్ గ్రిడ్' ఏర్పాటు సాధ్యమవుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సముద్రంలోకి వృథాగా పోయే వరద జలాలను ఒడిసిపట్టి తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తరలించడం ద్వారా తాగు, సాగునీటి రంగాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.
2027లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న గోదావరి పుష్కరాలకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. ఘాట్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, పారిశుద్ధ్యం మరియు శాశ్వత మౌలిక వసతుల కల్పనకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు తాజా పురోగతిని వివరిస్తూ, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నమోదైన లోటు వర్షపాతం, రైతులకు అందిస్తున్న సహాయక చర్యలను ప్రధానికి తెలియజేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు సైతం కేంద్రం పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.