గన్నవరంలో ఈ నెల 11 నుంచి శ్రీవాసవీ అమ్మవారి శరన్నవరాత్రులు..
గన్నవరం, మేజర్ న్యూస్.
గన్నవరం గ్రామంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ప్రార్థనా మందిరంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి అనుజ్ఞతో నిర్వహించే ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. శరన్నవరాత్రులు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైనవని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, భక్తిభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. విజయదశమి రోజున అమ్మవారి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, నిత్య అలంకరణ, ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, అష్టోత్తర పూజలు, శాంతి హోమం నిర్వహించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కుల, మత భేదాలు లేకుండా భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.