ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు..కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్...
అమలాపురం మేజర్ న్యూస్ ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశం మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ డిస్టిక్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ జిల్లా రెవిన్యూ అధికారి వి సుబ్బారావు జిల్లా ఎడిషనల్ ఎస్పి మహేంద్ర మత్తె తో కలిసి ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, చట్టాల అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, సంక్షేమ వసతి గృహాలు, విదేశీ ఉపాధికి వెళ్లే యువత సమస్యలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీలు, శ్మశాన వాటికలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
కమిటీ కేసుల దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియ, బాధితులకు పరిహారం అందజేతలో ఎలాంటి జాప్యం లేకుండా పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అట్రాసిటీ కేసులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను సకాలంల ఇప్పటికే మంజూరైన పనులను క్షేత్రస్థాయి పరిస్థితులతో క్రాస్ వెరిఫై చేసి నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురవుతున్న అంశాన్ని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రీ-సర్వేలో శ్మశాన వాటికల భూములను స్పష్టంగా గుర్తించి, హద్దులు నిర్ణయించి రికార్డుల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.మైనర్ బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాలకు వెళ్లిన తల్లిదండ్రుల పిల్లలు, ముఖ్యంగా మైనర్ బాలికల సంరక్షణ, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యాశాఖకు సంబంధించిన లీప్ యాప్, డేటా ఆధారంగా అధికారిక సంరక్షకుల పర్యవేక్షణలో ఉన్న బాలికల వివరాలను సేకరించి, వారికి అవసరమైన గుర్తింపు కార్డులు కేటాయించాలని సూచించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులను కలిసేందుకు అధికారికంగా గుర్తింపు పొందిన సంరక్షకులను మాత్రమే అనుమతించే విధంగా తగిన విధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.
హాస్టళ్లలో వసతులు, భద్రతపై నిరంతర పర్యవేక్షణ
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, నాణ్యమైన భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతుల విషయంలో రాజీపడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు వసతి గృహాలను తరచూ తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
అన్ని సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో పరిశీలించి, పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతు చేయించాలని సూచించారు.
నరేంద్రపురం గురుకుల పాఠశాల హాస్టల్ పరిసరాల్లో పాముల బెడద నివారణకు గార్డెన్ క్లీనింగ్, పరిసరాల పరిశుభ్రత పనులను తరచూ చేపట్టాలని సభ్యులు కోరగా, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
రాజోలు బాలుర హాస్టల్ సమస్య పరిష్కరించాలి
రాజోలు బాలుర హాస్టల్ భవనం కూల్చివేసిన నేపథ్యంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నూతన భవన నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించడంతో పాటు అప్పటివరకు విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలని కోరారు.
ఈ అంశంపై సంబంధిత ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రత్యామ్నాయ వసతులు, నూతన భవన నిర్మాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
విదేశీ ఉపాధికి వెళ్లే యువతకు రక్షణ
కోనసీమ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే యువత ప్రైవేట్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.ఏజెంట్ల కారణంగా పాస్‌పోర్టుల్లో వయస్సు తదితర వివరాల్లో తేడాలు ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం చూపాలని కోరారు. విదేశీ ఉపాధి పేరుతో జరిగే మోసాలపై యువతకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు.
సబ్జైళ్లపై క్షేత్రస్థాయి పరిశీలన
అమలాపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని సబ్‌జైళ్ల ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవోలు, డీఎస్పీలు సంయుక్తంగా పరిశీలించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించారు.
సబ్‌జైళ్లలో ఖైదీల సంఖ్య, అందుబాటులో ఉన్న వసతులు, సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించడంతో పాటు రిమాండ్ ఖైదీలను రాజమండ్రికి తరలించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
పరిధుల మార్పుపై పరిశీలన
సఖినేటిపల్లి మండలాన్ని రాజోలు పరిధిలోకి, మామిడికుదురు మండలాన్ని అమలాపురం పరిధిలోకి తీసుకురావడం ద్వారా పరిపాలనా సౌలభ్యం కల్పించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ అంశాన్ని పరిశీలించి నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యార్థులకు రవాణా సౌకర్యం
ఆలమూరు హాస్టల్ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు వ్యాన్ సౌకర్యం కల్పించాలని సభ్యులు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.