ఏసీ నగర్ ప్రభుత్వ హైస్కూల్‌కు కార్పొరేట్ హంగులు
రూ.9.69 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునికీకరణకు ముందుకొచ్చిన జిగ్మా కంపెనీ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
నెల్లూరు,కార్పొరేషన్, మేజర్ న్యూస్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఏసీ నగర్‌లో ఉన్న మల్లెల సంజీవయ్య ప్రభుత్వ హైస్కూల్‌ను రూ.9.69 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ఆధునికీకరించేందుకు జిగ్మా కంపెనీ ముందుకొచ్చిందని వెల్లడించారు. శుక్రవారం తన కుమార్తె పొంగూరు షరణితో కలిసి పాఠశాల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పాఠశాలకు చేరుకున్న మంత్రి నారాయణకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. విద్యాప్రదాతకు పూలవర్షంతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం నూతన విద్యాకమిటీ సభ్యులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో తిరిగి ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యకు నాన్న ఎంతో ప్రాధాన్యత ఇస్తారు --- షరణి
మంత్రి కుమార్తె పొంగూరు షరణి మాట్లాడుతూ తన తండ్రి స్టాటిస్టిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ అని, విద్యకు ఆయన ఎంత ప్రాధాన్యమిస్తారో అందరికీ తెలుసన్నారు. తాను చిన్నతనంలో అనుభవించిన పేదరికం, కష్టాలు పేద విద్యార్థులకు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ఖగోళశాస్త్రంపై అవగాహన పెంచేందుకు ఆస్ట్రో ల్యాబ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, దాతలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలు జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు మాట్లాడుతూ నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మంత్రి నారాయణ సంకల్పించారని తెలిపారు. ఆయన ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నారని, తద్వారా పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు.
వైకుంఠపురం పాఠశాల పరిశీలన అనంతరం మంత్రి నారాయణ వైకుంఠపురంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలోని సదుపాయాలను సమీక్షించి, ఆధునికీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వాతావరణం, నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ తిరుపాల్, ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ, జిగ్మా కంపెనీ ప్రతినిధి శంకర్ నారాయణ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.