ఎస్‌ఐఆర్‌ను అడ్డుకోవడం విడ్డూరం: తుంగల వెంకటగిరి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పారదర్శకంగా చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా ఎస్‌ఐఆర్ కన్వీనర్ తుంగల వెంకటగిరి అన్నారు. అవనిగడ్డలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 2,10,873 మంది ఓటర్లు ఉండగా, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండుచోట్ల ఓట్లు కలిగిన, ఆచూకీ లభించని వారు 13,138 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ, హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి, ఎన్నికల సంస్కరణలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భోగాది చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి భూపతి సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.