andhrapradesh
ఏపీలో పరిస్థితులను కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం
సూర్య ప్రతినిధి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఎంపీ మిథున్రెడ్డిపై జరిగిన దాడి ఘటనే ఇందుకు నిదర్శనమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ మిథున్రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిన ఆయన.. జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎన్నికలను సజావుగా జరపాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదని, రాష్ట్రంలో అరాచక పాలనతో రాష్ట్రాన్ని 'జంగిల్ రాజ్'లా మార్చేశారని ధ్వజమెత్తారు. అసలు ఒక లోక్సభ సభ్యుడికే రాష్ట్రంలో భద్రత లేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పెద్దలు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అక్రమాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో కాకుండా, పారామిలటరీ బలగాల (కేంద్ర బలగాలు) ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో క్షీణిస్తున్న ఈ దారుణ పరిస్థితులను తక్షణమే న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.