అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు ఈయూ , టీఎంయూ, ఎన్ఎంయూ ప్రతినిధులు మినిస్టర్ క్వార్టర్స్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘాల నాయకులను మంత్రి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగడం ఎంతో ముఖ్యమని అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల మాదిరిగానే విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యానికి కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వం ఏర్పడాలని అన్నారు. తాను కూడా విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు.
కార్మికుల సమస్యలను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో చర్చించి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కూడా ముందుగానే గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి ఎదురైన సమస్యలు తెలంగాణలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూనే సంస్థ అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.