అర్హులైన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి
సూర్య ఆర్సి,ఇల్లందుజిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, భూ రీ సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, కచ్చితత్వంతో విధులు నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఇల్లందు ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు, మామిడి గుండాలలో భూ రీ సర్వే పనులు, జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు సంబంధించి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వేను పరిశీలించారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల్లో భాగంగా ఇల్లందులోని సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. నూతన ఓటరు నమోదు కోసం ఫారం-6 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిని బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రత్యేక శిబిరాల సమయంలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సంప్రదింపు నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
*ఎంపీడీవో, ఏపీఎం లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్*
జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండగా ఇల్లందు ఎంపీడీవో, ఏపిఎం లు అందుబాటులో లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ పర్యటనకు సంబంధించిన విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన స్పష్టం చేస్తూ, సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో జీఓ నం. 76 కింద సింగరేణి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి స్థలాల పరిశీలనకు సంబంధించి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వేను కూడా కలెక్టర్ పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును, స్థలాల వాస్తవ పరిస్థితులను, దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత రికార్డులతో సరిపోల్చుకోవాలని అధికారులకు సూచించారు. స్థలాల విస్తీర్ణం, సరిహద్దులు, వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించాలని, సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను సంబంధిత రికార్డులతో ధ్రువీకరించి, తదుపరి ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఖాసీం, జిపిఓ లక్ష్మీకాంత్, మామిడి గుండాల సర్పంచ్ ఎట్టి రమణ మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఆర్ సి రిపోర్టర్ రాజేష్ ఇల్లందు