ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి నీ క్యాంపు కార్యాలయంలోఎన్ హెచ్ ఎం జేఏసీ ప్రతినిధులు కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం తదితర ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె, ఉద్యోగుల చిరకాల సమస్యలు, ప్రజారోగ్య సేవల్లో ఎన్ హెచ్ ఎం సిబ్బంది అందిస్తున్న సేవలను వివరించి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించి సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజారోగ్య పరిరక్షణలో నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు ప్రతినిధులు వెల్లడించారు.
పి.వినయ్ కుమార్ నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్