telanagana
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు
సూర్య, భీమ్గల్ : భీమ్గల్ పట్టణంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించగా, సాయంత్రం అర్చకులు నంబి మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.విద్య, జ్ఞానం, వివేకం, సంగీతం, సాహిత్యం, కళలకు అధిష్ఠాన దేవతగా సరస్వతి మాతను పూజిస్తారు. విద్యార్థులు చదువులో రాణించాలని, మంచి బుద్ధి, జ్ఞానం సిద్ధించాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు.అమ్మవారి నామస్మరణలు, పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.