జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక
సింహాద్రిపురం మేజర్ న్యూస్:
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి క్రీడా రంగంలో సత్తా చాటాడు. సింహాద్రిపురం మండలంలోని హిమకుంట్ల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హబీబ్ ఎస్జీఎఫ్ (SGF) అండర్-17 రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఘనతతో పాఠశాలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
హబీబ్ సాధించిన విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కృష్ణవేణమ్మ, వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీమతి సుమలతతో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల చేస్తున్న కృషికి హబీబ్ విజయం నిదర్శనమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కృషి, పట్టుదల, సరైన ప్రోత్సాహం ఉంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం జాతీయ స్థాయిలో రాణించగలరని ఈ విజయం నిరూపించిందన్నారు.
జాతీయ స్థాయి పోటీల్లో హబీబ్ తన ప్రతిభను చాటుకుని పాఠశాలకు, హిమకుంట్ల గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా