మిథున్ రెడ్డి పై డాడీ దారుణం. మాజీ ఎంపీ తలారి రంగయ్య.
కళ్యాణదుర్గం: రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిపై పుంగనూరులో జరిగిన దాడిని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదని పేర్కొన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడిపైనే రాళ్లతో దాడికి పాల్పడటం, హత్యాయత్నానికి తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే అధికార పార్టీ ప్రోద్బలంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజాప్రతినిధులకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తలారి రంగయ్య పేర్కొన్నారు. రాజకీయ కక్షలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన కోరారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.