నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలి
తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ఎల్నినో ప్రభావాల నేపథ్యంలో తెలంగాణ రైతులు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. ఎల్నినో అనేది తెలంగాణకు మాత్రమే సంబంధించిన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రకృతి సంబంధిత పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను అప్రమత్తం చేశారని తెలిపారు. ఎల్నినో ప్రభావాలతో తొలుత నష్టపోయే అవకాశం రైతులకే ఉంటుందని చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. అందువల్ల రైతులు సాగు ప్రణాళికలను రూపొందించుకునే సమయంలో నీటి లభ్యతను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అధికంగా నీరు అవసరమయ్యే పంటల సాగుకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా నీటి వనరుల లభ్యతపై స్పష్టత లేకుండా వరి వంటి పంటలను సాగు చేస్తే పంటకు అవసరమైన నీరు అందక ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.