ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించండి సీఐ కాళీ చరణ్
ఉండి, మేజర్ న్యూస్:ఎన్నికల సజావుగా జరిగేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. కాళీచరణ్ అన్నారు.ఎస్ఐ హనుమంతు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సోమవారం పాములపర్రు గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ నాయకులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జి. కాళీచరణ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, రాజకీయ ప్రచార కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఇతర రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించకూడదని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖకు రాజకీయ నాయకులు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ సిబ్బందితో పాటు అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ఈతకోట రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా,