ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండండి... ప్రతి ఓటర్ ను కలవండి. ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రత్యర్థి పార్టీ నాయకులు లేదా కార్యకర్తల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా వాటిని గుర్తించి సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా గొడవలకు దిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వెంటనే సంబంధిత ఎస్సై లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికలకు మిగిలిన నాలుగు రోజులు ఎంతో కీలకమని, అభ్యర్థులు మరింత కష్టపడి ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించి ఓటు అభ్యర్థించాలని కోరారు. ప్రతి ఓటరును ఒకటికి రెండుసార్లు కలిసి తమ అభ్యర్థిత్వానికి మద్దతు కోరాలని తెలిపారు. గ్రామంలో ఓటు హక్కు కలిగి ఉండి ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించి ఎన్నికల ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. అదేవిధంగా నామినేషన్లు దాఖలు చేసి అనంతరం ఉపసంహరించుకున్న నాయకులు, కార్యకర్తలను కూడా కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.