ఎన్ని పొర్లు దండాలు పెట్టిన, కుప్పిగెంతులు వేసిన అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డికి పగటి కలే ఎమ్మెల్సీ వర్ల రామయ్య
అమరావతి, మేజర్‌న్యూస్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిలా తయారైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి చేతికి ఏది దొరికితే దాన్ని పట్టుకుని బయటపడాలని ప్రయత్నించినట్లుగా, జగన్ కూడా రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి ఏది పడితే అది పట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి జగన్ వ్యవహారశైలి చూస్తుంటే ఆయనకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు లభించకపోవడం, వైసీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం, పోటీ చేసిన చోట్ల ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో జగన్ నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఈ నిరాశ, నిస్పృహల్లో భాగంగానే నేడు గవర్నర్‌ను కలవడానికి జగన్ బృందం వెళ్తున్నారని వర్ల రామయ్య అన్నారు. అయితే గవర్నర్‌ను కలిసి వైసీపీ నేతలు ఏం చెప్పబోతున్నారని ప్రశ్నించారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తారా? లేక తాము ఇస్తున్న తప్పుడు ఫిర్యాదులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవడం లేదని చెబుతారా? ఎన్నికల సంఘానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నామని, వాటిని అధికారులు గుర్తిస్తున్నారని గవర్నర్‌కు వివరిస్తారా? అని నిలదీశారు. నామినేషన్లు అడ్డుకున్నారంటున్నారు.. ఎక్కడ? ఎప్పుడు? ఎవరు అడ్డుకున్నారు? జగన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం స్పష్టత లేదని వర్ల రామయ్య అన్నారు. ఇప్పటికీ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని పదేపదే చెబుతున్నారని, అసలు ఏ గ్రామంలో అడ్డుకున్నారు? ఏ అభ్యర్థిని అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకున్నారు? ఏ సమయంలో ఈ ఘటన జరిగింది? అప్పట్లో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఎవరు? అనే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పగలరా? అని సవాల్ విసిరారు. ఏ గ్రామంలో, ఏ పోలింగ్ కేంద్రం వద్ద, ఏ నామినేషన్ దాఖలు కేంద్రంలో అభ్యర్థులను అడ్డుకున్నారో కనీసం ఒక్క ఘటననైనా ఆధారాలతో వివరించగలరా? ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది? బాధితులెవరు? ఫిర్యాదు ఎక్కడ చేశారు? అన్న వివరాలేవీ బయటపెట్టకుండా అడ్డుకున్నారు.. అడ్డుకున్నారు అంటూ గాలిలో ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జరిగిన ఘటనలను ఆధారాలతో చూపించకుండా పదేపదే ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని వర్ల రామయ్య స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు, ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో వైసీపీ చేస్తున్న రాజకీయ డ్రామాలు, తప్పుడు ఫిర్యాదులు బయటపడుతున్నాయని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా, ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాలను అంగీకరించలేక ప్రభుత్వంపై, పోలీసులపై, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. గవర్నర్‌ను కలిసే ముందు జగన్ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సిద్ధం చేసుకోవాలని, కేవలం రాజకీయ ప్రచారం కోసం రాజ్యాంగబద్ధమైన పదవులను వేదికగా చేసుకోవద్దని ఎమ్మెల్సీ వర్ల రామయ్య హితవు పలికారు.
పులివెందులలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే వైసీపీ నేతలు స్టేజ్ మేనేజ్డ్ డ్రామాలు ఆడుతున్నారు
పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వారు ఆడుతున్న "మాయ నాటకాలను" ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, బయటకు రావద్దని రాతపూర్వక నోటీసులు ఇచ్చి సంతకం తీసుకున్నారని వర్ల రామయ్య తెలిపారు. అయితే, గౌరవ ఎంపీగా చట్టాలను గౌరవిస్తారని పోలీసులు భావిస్తే, వారు వెళ్ళిన పావుగంటలోనే అవినాష్ రెడ్డి 5 కార్లతో బయలుదేరి, క్రమంగా 35 కార్ల కాన్వాయ్‌తో సింహాద్రిపురం వైపు వెళ్లారని ఆయన వివరించారు. పోలీసులు కాన్వాయ్‌ను నిలువరించిన సమయంలో, తమపై పెట్రోల్ బాంబులు, ఐరన్ రాడ్లు, కర్రలతో హత్యాయత్నం జరిగిందని, త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని వారి సొంత ఛానెల్ ద్వారా ప్రచారం చేసుకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. వాస్తవానికి అక్కడ కనీసం ఒక చిన్న రాయి కూడా పడలేదని పోలీసులు స్పష్టం చేశారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లగలరా అని ఆయన ప్రశ్నించారు.
పులివెందులలో గత 40 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎట్టకేలకు తమ ఓటు తాము వేసుకునే స్వేచ్ఛ లభించిందని, వైయస్ కుటుంబ అరాచకాలకు తెరపడిందని భావించిన పులివెందుల ప్రజలు ఆ రోజు నిజమైన దీపావళి పండుగను జరుపుకున్నారని ఆయన అన్నారు. ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాలేదని విమర్శించారు. "ఒక్క ఛాన్స్" పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలెవరూ ఆయనను ఆహ్వానించడం లేదని, నిరాశ నిస్పృహలతో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.
ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం తగదు.. సొంత చెల్లెలిపైనే కోర్టుకెక్కడం జగన్ నైజానికి నిదర్శనం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, మరోవైపు సొంత చెల్లెలు వైఎస్ షర్మిలను బెంగళూరులోని బంగ్లాలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు "రెండేళ్లలో మేము వస్తాం, మాకు వ్యతిరేకంగా పనిచేసిన వారి సంగతి తేలుస్తాం" అంటూ ప్రభుత్వ అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సొంత పత్రిక, ఛానల్‌లో సీనియర్ అధికారులు చెరుకూరి శ్రీధర్, నచికేత్ విశ్వనాథ్, కోయ ప్రవీణ్, ప్రద్యుమ్న, మహేష్ చంద్ర లడ్డా, డీజీపీ, ఎస్‌ఈసీలపై "గుండెలు తీసిన పచ్చ బంట్లు" అంటూ తప్పుడు కథనాలు రాయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసినప్పుడు ఈ కథనాలను చూపించే ధైర్యం జగన్ మోహన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. పులివెందులలో 40 ఏళ్లుగా నిర్మించుకున్న అక్రమ కోటను ప్రజలు ఓటు అనే ఆయుధంతో కూల్చేశారని వ్యాఖ్యానించారు. ఆ ఓటమి తాలూకు నిరాశ, నిస్పృహలతోనే జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు రాతలు రాయిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ ఆయనకు అధికారం ఇచ్చే పరిస్థితి లేదని, కేవలం మిగిలిన కొద్దిపాటి క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే "మళ్లీ వస్తాం" అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ జేఎంఎఫ్‌సీ కోర్టులో జగన్ మోహన్ రెడ్డి తన చెల్లెలు షర్మిలపై దావా వేశారని వర్ల రామయ్య ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. 2026 నవంబర్ 20న ఫైల్ అయిన ఈ ఒరిజినల్ సూట్ (ఫైలింగ్ నెం. 1525/2026, రిజిస్ట్రేషన్ నెం. 1509/2026, CNR నెం. KABR310019262026) నవంబర్ 21న రిజిస్టర్ అయిందని ఆయన తెలిపారు. బెంగళూరులోని యలహంక బంగ్లాలోకి తన చెల్లెలు షర్మిల అడుగుపెట్టకుండా నిరోధించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి ఈ కేసు వేశారని వివరించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఆ బంగ్లాలో, తన కుమార్తె వివాహ వేడుకలు నిర్వహించుకోవడానికి షర్మిల ప్రయత్నించగా, మేనమామ అయిన జగన్ మోహన్ రెడ్డి అందుకు ససేమిరా అనడమే కాకుండా కోర్టుకు వెళ్లడం ఆయన వ్యవహారశైలికి అద్దం పడుతోందని వర్ల రామయ్య విమర్శించారు.
ప్రజా జీవితంలో ఉన్న వారి ప్రతి చర్య ప్రజల పరిశీలనలోనే ఉంటుంది
ప్రజా జీవితంలో ఉన్న నాయకుల వ్యవహారశైలి సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. సాధారణ వ్యక్తులు ఇంట్లో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరని, కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి ప్రతి అడుగు పబ్లిక్ డొమైన్‌లోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మన తెలుగు సంస్కృతిలో మేనకోడలి పెళ్లిని సొంత కూతురి వివాహం కంటే ఘనంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి తన మేనకోడలి పెళ్లికి బెంగళూరులోని ఇంట్లోకి రానివ్వనని చెప్పడమే కాకుండా, ఏకంగా చెల్లెలు షర్మిల ఇంట్లో అడుగుపెట్టకుండా కోర్టులో కేసు వేయడం బాధాకరమని అన్నారు. సొంత చెల్లెలి పట్ల ఇలా వ్యవహరించే వ్యక్తి, రాష్ట్రంలోని మిగతా అక్కచెల్లెళ్లను ఏ విధంగా గౌరవిస్తారని ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఈ పరిణామాలతో ఎంత మనోవేదనకు గురవుతారో ఆలోచించాలని, ఇది పుండు మీద కారం చల్లడమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీ వంటి మహామహులే ఎన్నికల్లో ఓడిపోయారని, కానీ వారు ఎప్పుడూ ఇలా నిరాశా నిస్పృహలతో వ్యవహరించలేదని వర్ల రామయ్య పేర్కొన్నారు. పులివెందుల ప్రజలు నిరాకరించారనే అసహనంతో జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. "రెండేళ్లలో మళ్లీ వస్తాం, అందరి సంగతి తేలుస్తాం" అనడం కేవలం అర్థరహితమని, పాలిచ్చే గేదెను కాదని తన్నే దున్నపోతును ప్రజలు మళ్లీ ఆహ్వానించరని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందని వారి సొంత ఛానల్, పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని, కానీ ఘటనా స్థలం ఎక్కడో చెప్పాలని పోలీసులు అడిగితే "మీరే ఏదో ఒకటి రాసుకోండి, నేను ఫిర్యాదు ఇవ్వను" అని అవినాష్ రెడ్డి చెప్పినట్లు పులివెందుల డీఎస్పీ స్వయంగా ప్రకటించారని వర్ల రామయ్య గుర్తు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తేవడం సరికాదని అన్నారు. ఇలా పదేపదే అబద్ధపు ప్రచారాలు చేస్తే 'నాన్న పులి' కథలాగా మారి, భవిష్యత్తులో నిజంగా ఏదైనా జరిగినా ఎవరూ నమ్మని పరిస్థితి వస్తుందని ఆయన హితవు పలికారు.