ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక సంస్థల ఎన్నికల విధులలో మోటారు వాహనాల చట్టం ప్రకారం కేవలం పసుపు రంగు నెంబర్ ప్లేట్ కలిగిన కమర్షియల్/టాక్సీ రిజిస్ట్రేషన్ వాహనాలను మాత్రమే అద్దెకు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా తెలుపు రంగు నెంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాలను అద్దె ప్రాతిపదికన ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణకు మొదట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పోలింగ్ సిబ్బంది, సామాగ్రి తరలింపునకు ఇవి సరిపోకపోతేనే కలెక్టర్ ప్రత్యేక ఆర్డర్ రిక్విజిషన్ ద్వారా ప్రైవేట్ వాహనాలను తాత్కాలికంగా నిర్బంధంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. ఈ విధంగా అధికారికంగా సేకరించిన వాహనాలకు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించిన రోజువారీ అద్దె, ఇంధన ఖర్చులు చెల్లిస్తారని, అలాగే విధుల్లో పాల్గొనే ప్రతి కమర్షియల్ వాహనానికి ఆర్టీఓ పర్మిట్లు, కమర్షియల్ ఇన్సూరెన్స్, ఫిట్నెస్, కాలుష్య నియంత్రణ పత్రాలతో పాటు డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే కమర్షియల్ లైసెన్స్ ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు. రవాణా శాఖ మరియు ఎన్నికల సంఘం నిర్దేశించిన రేట్ల ప్రకారమే అద్దె చెల్లింపులు జరుగుతాయని, నిబంధనల ఉల్లంఘనలపై నిఘా ఉంచడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించుతున్నామని, ప్రైవేట్ వాహనాలను నిబంధనలకు బాహ్యంగా అద్దెకు ఇస్తేయజమానులపై, వాటిని తీసుకునే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.