ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండల పరిషత్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుల ఎన్నికను గురువారం నిర్వహించారు. తొలుత ఎంపీటీసీ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశానికి హాజరైన ఎనిమిది మంది తెలుగుదేశం ఎంపీటీసీ సభ్యులు, ఒక్క వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు హాజరయ్యారు. చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ కేతా వేణుగోపాల్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థిగా కరటంపాడు ఎంపీటీసీ మెంబర్ దావా సుమన్యను ప్రతిపాదించారు. వాశిలి ఎంపీటీసీ మెంబర్ మామిడి చందన బలపరిచారు. తదుపరి సమావేశానికి హాజరైన వైసీపీ ఎంపీటీసీ మినహా మిగతా ఎనిమిది మంది చేతులెత్తి సమ్మతి తెలియజేశారు. దాంతో సుమన్య ఏకగ్రీవంగా మండల అధ్యక్షురాలుగా ఎన్నికైనట్లు అధికారి కోటేశ్వరరావు ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప మండల అధ్యక్ష పదవికి ఎంపీటీసీ మెంబర్ కొల్లి నరసయ్య నాయుడును నువ్వూరుపాడు ఎంపీటీసీ మెంబర్ షేక్ ఖాజావలి ప్రతిపాదించగా మురుగుళ్ల ఎంపీటీసీ మెంబర్ పువ్వాడ వెంకటేశ్వర్లు బలపరిచారు. ఎనిమిది మంది తెలుగుదేశం ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి సమ్మతి తెలియజేయడంతో నరసయ్య నాయుడు ఉప మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పిఓ ప్రకటించి ఈ మేరకు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో పి. రఫీఖాన్, తహసిల్దార్ పి. పద్మజ కుమారి, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.