ఎల్. కోటలో ఆదివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
లక్క వరపు కోట సూర్య: లక్కవరపుకోట మండలం లోని ఎల్ కోట మేజర్ పంచాయతీలోని శ్రీ సీతారామాలయం (జగన్నాథ స్వామి ఆలయం)లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వేద పండితులు అక్కాజోస్యుల శ్రీ హరిశర్మ తెలిపారు. శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాంప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, పారాయణాలు, అమ్మవారి అలంకరణలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 11న కలశ స్థాపన, సర్వదేవతారాధనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి అభిషేకం, అర్చన, హోమం నిర్వహిస్తారు. అక్టోబర్ 16న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం, విద్యార్థులకు ప్రత్యేక పూజలు చేపడతారు. అక్టోబర్ 17న సహస్ర దీపారాధన, అక్టోబర్ 18న సామూహిక లక్ష కుంకుమార్చన, సువాసినీ పూజ నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న విశేష అలంకరణ, అక్టోబర్ 20న సామూహిక వాహన పూజలతో పాటు షష్ఠిపూర్తి పూజలు జరగనున్నాయి. అక్టోబర్ 21న పూర్ణాహుతి, శ్రీ రుక్మిణీ కల్యాణం, మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.తేది 12 నుంచి 18 వరకు వెంకటేశ్వర స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతుంది అని ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.