ఏకగ్రీవ పంచాయతీలకు ఏపీ సర్కార్ బంపరాఫర్
అమరావతి :ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగిన వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడంతో పాటు గ్రామాల్లో ప్రశాంత, సద్భావన వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ నగదు ప్రోత్సాహకాలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు నాలుగు కేటగిరీల కింద కనిష్ఠంగా రూ.5 లక్షల (కొన్ని విభాగాల్లో రూ.2 లక్షలు) నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు మాత్రమే ప్రోత్సాహకం అందేది. అయితే తాజా సవరణల ప్రకారం ప్రభుత్వం ఆ నాలుగు కేటగిరీలను మూడుకు కుదించి, ప్రోత్సాహక మొత్తాలను కనిష్ఠంగా రూ.15 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు పెంచింది.
కొత్త నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నజరానాను మూడు శ్లాబులుగా విభజించారు. ఐదు వేల లోపు జనాభా ఉండి ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, పది వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలు ఏకగ్రీవమైతే గరిష్ఠంగా రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేయనుంది. అయితే ఈ ప్రోత్సాహక నిధులకు అర్హత సాధించాలంటే కేవలం సర్పంచ్ పదవి మాత్రమే కాకుండా ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం కావాల్సి ఉంటుందని, ఆ విషయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అందించే ఈ ప్రోత్సాహక నిధులను పూర్తిగా ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసమే వినియోగించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో 13,168 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ నజరానాతో గ్రామాల్లో ఏకగ్రీవాల దిశగా చర్చలు మరింత ఊపందుకున్నాయి.