సర్పంచ్ ఎన్నికలపై నంద్యాల మండల టీడీపీ నేతలతో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కీలక సమీక్ష
సూర్య, నంద్యాల బ్యూరో: రానున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు , నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ నాయకులతో మాట్లాడుతూ మండలంలోని గ్రామాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత మరియు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల ప్రక్రియలో విజయవంతంగా ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి , నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి తో పాటు మండలంలోని వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*