ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నగదు ప్రోత్సాహకాలు : రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బహుమానం : అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కలెక్టర్ వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : 2026 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు,5,001 నుంచి 10 వేల వరకు రూ.25 లక్షలు,10 వేలకు పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందిస్తామన్నారు.ఏకగ్రీవ ఎన్నికలు పూర్తిగా స్వచ్ఛందంగా జరగాలని,ఎలాంటి బలవంతం,ఒత్తిడి,ప్రలోభాలకు తావుండకూడదని స్పష్టం చేశారు.ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు,వాటి అర్హతలు,నిబంధనలపై గ్రామ పంచాయతీలు,గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల వివరాలను జనాభా ప్రాతిపదికన సేకరించి, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ ప్రోత్సాహక పథకం 2026 సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి