ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ
ధర్మవరం సూర్య మేజర్ న్యూస్:
బత్తలపల్లె మండలంలో జరిగిన ఎంపీటీసీ,జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ధర్మవరం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ప్రభాకర్ స్పష్టం చేశారు. అక్టోబర్ 22వ తేదీన బత్తలపల్లె మండలంలో జరిగిన ఎంపీటీసీ /జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి, వైయస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియా ద్వారా రూరల్ సీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైయస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించుకునేందుకు సీఐ లంచం తీసుకున్నారంటూ ఆయన ఆరోపించిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.ఈ విషయంపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమైనవని స్పష్టం చేస్తూ, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి తాను ఎవరి వద్ద కూడా లంచం అడగలేదని, తీసుకోలేదని తేల్చిచెప్పారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు పోలీసుల తరఫున అవసరమైన భద్రత మరియు సహకారం అందించామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు కూడా ఎలాంటి వివక్ష లేకుండా రక్షణ కల్పించామని, పోలీసు వాహనాన్ని అభ్యర్థుల భద్రత మరియు సురక్షిత రాకపోకల కోసం మాత్రమే వినియోగించామని, ఎలాంటి డబ్బులు తీసుకుని నామినేషన్లు వేయించలేదని స్పష్టం చేశారు.తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలను సమర్పించాలని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కోరారు. ఆరోపణలకు వాస్తవ ఆధారాలు లేని పక్షంలో, చట్టప్రకారం తగిన న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని తెలిపారు. పోలీస్ శాఖ ఎప్పుడూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ, శాంతిభద్రతలను పరిరక్షించడానికి మరియు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని తెలియజేశారు.
జంపుల అజయ్ నాయుడు సూర్య సత్యసాయి జిల్లా కరస్పాండెంట్