చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించేందుకు సుడాలగుంట షుగర్స్ అంగీకారం
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: తిరుపతి జిల్లాలోని సుడాలగుంట షుగర్స్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎల్) యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ.30 కోట్ల దీర్ఘకాలిక బకాయిలను నవంబర్ 30 నాటికి పూర్తిగా చెల్లించేందుకు అంగీకరించింది. గత కొన్నేళ్లుగా కర్మాగారం మూతపడటం, రుణ వివాదాల్లో చిక్కుకోవడంతో శ్రీకాళహస్తి (యూనిట్-1), పొదలకూరు (యూనిట్-2) పరిధిలోని వేలాది మంది చెరకు రైతులు తమకు రావాల్సిన బిల్లుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారంపై తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీ యజమాని జయరామ్ చౌదరి మరియు రైతు ప్రతినిధులతో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం మౌఖిక హామీలు ఇస్తే సరిపోదని, బకాయిలు ఏ విధంగా తీరుస్తారో రాతపూర్వక కార్యాచరణ ప్రణాళికతో పాటు అఫిడవిట్ దాఖలు చేయాలని యాజమాన్యానికి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అధికార యంత్రాంగం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీనిపై స్పందించిన సుడాలగుంట షుగర్స్ అధినేత జయరామ్ చౌదరి, రైతులకు సంబంధించిన రూ.30 కోట్ల బకాయిలను నవంబర్ 30 లోగా రెండు విడతల్లో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి రూ.2 కోట్ల ముందస్తు చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు.
రైతులతో పాటు కర్మాగారంలో పనిచేసిన హార్వెస్టింగ్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలపై యూనిట్ల వారీగా సమగ్ర జాబితాను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చెరకు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పరిశ్రమల శాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని యాజమాన్యంతో చర్చలు జరిపి నిర్దిష్ట గడువును నిర్ణయించడం పట్ల బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నవంబర్ నెలాఖరు నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వెల్లడించారు.