‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, మేజర్ న్యూస్ : బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.22 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలు మరోసారి కూటమికి అవకాశం ఇస్తే బుచ్చిరెడ్డిపాళెం రూపురేఖలను మారుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 5, 21, 23, 24 వార్డుల్లో గురువారం నిర్వహించిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు స్థానిక ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మితో పాటు 5వ వార్డు టీడీపీ అభ్యర్థి అందె పెంచల ప్రత్యూష, 21వ వార్డు అభ్యర్థి బండ్ల ధనలక్ష్మి, 23వ వార్డు అభ్యర్థి తాళ్ల వైష్ణవి, 24వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆలూరు నాగవేణిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
రూ.22 కోట్లతో అభివృద్ధి పనులు.. ప్రతి వార్డుకూ ప్రాధాన్యం
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించిన రూ.45 కోట్లలో ఇప్పటికే రూ.22 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులను వేగవంతం చేశామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. 5వ వార్డులో ఇప్పటికే రూ.33.50 లక్షల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. అరుంధతివాడలోని వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించిందని, త్వరలో పనులు చేపడతామని వెల్లడించారు. అంబేడ్కర్ నగర్ శ్మశానవాటిక పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 23వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టామని, తాళ్ల వైష్ణవిని గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి వార్డును మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.
గత పాలనలో అవకతవకలు.. ఇప్పుడు పనులతో సమాధానం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విమర్శించారు. ప్రజలకు అవసరమైన పనులను పక్కనపెట్టి, అనేక అభివృద్ధి కార్యక్రమాలను అసంపూర్తిగా వదిలేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలోని సమస్యలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం విషయంలో గతంలో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడి, బుచ్చిరెడ్డిపాళెంలో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి ముందడుగు వేశామని గుర్తుచేశారు. గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన మల్దేవి వంతెన పనులను తిరిగి ప్రారంభించామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి.. కూటమి పాలనకు రెండు కళ్లు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుని యువతకు అవకాశాలు కల్పించామని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందించడం ద్వారా రైతుల భూమి హక్కులకు భరోసా కల్పించామని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
కోవూరు యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు
యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని సాధించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు నియోజకవర్గ యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కిసాన్ సెజ్‌లో పరిశ్రమలు, ఉద్యోగావకాశాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధితో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రజల్లో ఉండే నాయకత్వానికి పట్టం కట్టండి
ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే నాయకులకే స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోరారు. కూటమి పార్టీల్లో సమర్థులైన నాయకులు ఎంతోమంది ఉన్నారని, పార్టీ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ధర్మంలో భాగంగా 24వ వార్డును మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించామని, ఈ నిర్ణయంలో త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు పోలిశెట్టి నరసన్నకు తగిన గుర్తింపు కల్పిస్తామని తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయానికి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం భవిష్యత్తు అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనతో ముడిపడి ఉందని పేర్కొంటూ, ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.