చవటపల్లి ముందర అసంపూర్తిగా ఎన్‌హెచ్‌ఐ సర్వీస్ రోడ్డు -ప్రమాదాల బారిన గ్రామస్తులు, విద్యార్థులు! - అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం - తమ సిబ్బందికి భద్రత ముఖ్యమైనప్పుడు.. ప్రజల ప్రాణాలు పట్టవా? అంటూ ఆవేదన
పూతలపట్టు మేజర్ న్యూస్ :
బెంగుళూరు నాయుడుపేట జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐ) అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా చవటపల్లి గ్రామస్తులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు చవటపల్లి ముందర నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ఐ సర్వీస్ రోడ్డు పనులు మధ్యలోనే అసంపూర్తిగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇక్కడ నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రతిరోజూ వ్యవసాయ పనులకు, ఇతర అత్యవసర నిమిత్తం బయటకు వెళ్లే గ్రామస్తులు, ముఖ్యంగా బడికి వెళ్లే చిన్నారులు, కళాశాల విద్యార్థులు ఈ అసంపూర్తి రోడ్డు వల్ల అనేక ఇబ్బందులకు పడుతున్నారు వాహనదారులు, పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని, రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని గ్రామస్థులు, ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఐ అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు "బ్రిడ్జి నిర్మాణం, ఇతర రహదారి పనులు చేసేటప్పుడు ఎన్‌హెచ్‌ఐ అధికారులు, సిబ్బందికి మాత్రం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు (సేఫ్టీ) అవసరమవుతున్నాయి మరి నిత్యం ఇదే రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్న సామాన్య గ్రామస్తులకు, చిన్నారులకు భద్రత అవసరం లేదా?" అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ఎన్‌హెచ్‌ఐ సిబ్బంది స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెను ప్రమాదాలు జరగకముందే చవటపల్లి ముందర అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేసి, గ్రామస్తులకు, విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని చవటపల్లి గ్రామస్తులు, ప్రయాణికులు, స్థానికులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్