బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీకి విముక్తి.. 95 మంది ఆదివాసీ వలస కూలీలకు రక్షణ
అనంతపురం బ్యూరో : బొగ్గు బట్టీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న 95 మంది ఆదివాసీ వలస కూలీలకు అధికారులు విముక్తి కల్పించారు. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్, డి. హీరేహాళ్ మండలాల్లో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాకు చెందిన కూలీలను గుర్తించి రక్షించారు. వీరిలో మహిళలు, పురుషులు, వృద్ధులతో పాటు మూడో వంతుకు పైగా చిన్నారులు ఉన్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు.
సంయుక్త తనిఖీలతో వెలుగులోకి..
జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వెట్టిచాకిరీ నివారణ జిల్లా విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ఉదయం 8.30 గంటలకు బొమ్మనహాళ్ మండలం ఎలంజి గ్రామ పొలాల్లో, డి. హీరేహాళ్ మండలంలోని బొగ్గు బట్టీల వద్ద సంయుక్త స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, కార్మిక శాఖల అధికారులు, ఐజేఎం, రెడ్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
బొమ్మనహాళ్ మండలంలో 40 మంది, డి. హీరేహాళ్ మండలంలో 55 మంది చొప్పున మొత్తం 95 మందిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది చిన్నారులు పదేళ్లలోపు వయస్సు వారేనని వెల్లడించారు.
అడ్వాన్సుల పేరుతో బలవంతపు పని
మహారాష్ట్రకు చెందిన యజమాని వద్ద ముందస్తుగా డబ్బులు తీసుకున్నామని, వాటిని తిరిగి చెల్లించాలనే పేరుతో తమను నిర్బంధించి, వేధింపులకు గురిచేస్తూ బలవంతంగా పనులు చేయిస్తున్నారని బాధిత కూలీలు అధికారులకు తెలిపినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అడ్వాన్సుల పేరుతో కూలీలను పనుల్లో బంధించడం, స్వేచ్ఛగా వెళ్లనివ్వకపోవడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
విముక్తి పత్రాలు జారీ.. స్వస్థలాలకు తరలింపు
రక్షించిన కూలీలను రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయానికి తరలించి, కల్యాణదుర్గం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ద్వారా సెప్టెంబర్ 30న విముక్తి పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్–2021 కింద ఈ పత్రాలు జారీ చేసినట్లు కార్మిక శాఖ తెలిపింది.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉప కార్మిక కమిషనర్ ఆధ్వర్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల ద్వారా బాధితులను సురక్షితంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాకు తరలించారు. ఈ విషయాన్ని అక్కడి జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా తెలియజేశారు.
యజమానులపై కేసులకు చర్యలు
వెట్టిచాకిరీ వ్యవస్థ (నిర్మూలన) చట్టం, 1976లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని బొమ్మనహాళ్, డి. హీరేహాళ్ తహసీల్దార్లు పోలీసులను కోరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నారుల సంరక్షణకు సంబంధించిన చట్టాల కింద కూడా చర్యలు తీసుకునే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
వెట్టిచాకిరీ వ్యవస్థను చట్టం ద్వారా రద్దు చేశారని, ఈ వ్యవస్థలో భాగంగా కూలీలపై విధించే రుణబాధ్యతలు చట్టపరంగా చెల్లవని అధికారులు తెలిపారు. బలవంతంగా వెట్టిచాకిరీ చేయించడం నేరమని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఒక్కొక్కరికి రూ.40 వేల వరకు తక్షణ సాయం
విముక్తి పొందిన ప్రతి కూలీకి కేంద్ర ప్రభుత్వ పథకం నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.40 వేల వరకు తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు పునరావాస ప్రయోజనాలు కల్పించనున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ఉపాధి అవకాశాలు, పిల్లల విద్య, వైద్య సదుపాయాలు వంటి ప్రయోజనాలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. రాయ్‌గడ్ జిల్లా అధికారుల సమన్వయంతో బ్యాంకు ఖాతాలు, గుర్తింపు వివరాల నమోదు పూర్తి చేసి అర్హులకు పథకం ప్రయోజనాలు అందించనున్నారు.
జిల్లావ్యాప్తంగా తనిఖీలకు కార్యాచరణ
జిల్లాలో వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా త్వరలో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు బట్టీలు, ఇటుక బట్టీలు, క్వారీలు, రైస్ మిల్లులు, వ్యవసాయ క్షేత్రాల్లో కార్మిక, రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త బృందాలు సర్వే చేపట్టనున్నాయి.
సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయండి
అడ్వాన్సుల పేరుతో కూలీలను నిర్బంధించడం, పనులు మానుకుని వెళ్లకుండా అడ్డుకోవడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్యలని కార్మిక శాఖ హెచ్చరించింది. జిల్లాలో ఎక్కడైనా వెట్టిచాకిరీ, బాలకార్మికులు లేదా బలవంతంగా నిర్బంధించబడిన వలస కూలీలు కనిపిస్తే సమీప తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లేదా జిల్లా ఉప కార్మిక కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందించాలని ప్రజలను కోరింది.
ఫిర్యాదుల కోసం 9492555187 నంబర్‌ను సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జి. లక్ష్మీ నర్సయ్య తెలిపారు.