BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

బోగస్‌ ప్లాట్లకు అక్రమ ఎండోర్స్‌మెంట్‌.. నకిలీ పత్రాలతో స్టీల్‌ప్లాంట్‌ భూములు హాంఫట్‌!

Select Suryaa Now
బోగస్‌ ప్లాట్లకు అక్రమ ఎండోర్స్‌మెంట్‌.. నకిలీ పత్రాలతో స్టీల్‌ప్లాంట్‌ భూములు హాంఫట్‌!

గాజువాక, సూర్య :  గాజువాక మండలం వడ్లపూడి కాలనీ సెక్టార్‌-1లో రోడ్డు పక్కన ఉన్న ‘మిగిలిన స్టీల్‌ప్లాంట్‌ భూమి’ని కొల్లగొట్టేందుకు ఎస్‌డీసీ కార్యాలయం కేంద్రంగా తెరవెనుక పెద్ద తతంగమే నడిచింది. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన కొందరు అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక మాస్టర్‌ లేఅవుట్‌లోనే లేని ఒక బోగస్‌ ప్లాట్‌ నంబరును సృష్టించి, అక్రమ ఎండోర్స్‌మెంట్‌ ఇప్పించడంలో తెరవెనుక సూత్రధారి సుధాకర్‌ చక్రం తిప్పాడని.. ఈ దందాలో ఏకంగా రూ.20 లక్షల భారీ ముడుపులు చేతులు మారాయని స్థానికులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఎస్‌డీసీ కార్యాలయంలో అన్నీ తానై నడిపిస్తున్న సుధాకర్‌ అధికారులకు లంచాలు ఎరవేస్తూ, విలువైన భూములను కబ్జాదారులకు కట్టబెట్టిస్తున్నాడన్న విమర్శలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

లేఅవుట్‌లో లేని ‘749ఏ’.. ప్లాట్ కేటాయింపే లేని ఆర్‌-కార్డుకు ఎండోర్స్‌మెంట్‌ ఎలా ఇచ్చారు?

ప్రభుత్వం ఆమోదించిన వడ్లపూడి సెక్టార్‌-1 మాస్టర్‌ లేఅవుట్‌ ప్రకారం ఆ బ్లాక్‌లో ప్లాట్‌ నెం. 736 నుంచి 749 వరకే ఉన్నాయి. ఆఖరి ప్లాట్‌ 749 పక్కన రోడ్డు మార్జిన్‌తో పాటు ‘మిగిలిన స్టీల్‌ప్లాంట్‌ భూమి’ ఉంది. ఇప్పటికే ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించగా.. ఆ కబ్జాకు ఎండోర్స్‌మెంట్‌ ఇప్పించి దర్జాగా కాజేసేందుకు సూత్రధారి సుధాకర్‌ రంగంలోకి దిగాడు. కొత్త దిబ్బపాలెం నిర్వాసితురాలి ఆర్‌-కార్డు నెం. 126ను అడ్డం పెట్టుకుని, లేఅవుట్‌లోనే లేని ‘ప్లాట్‌ నెం. 749ఏ’  పేరిట అధికారులతో ఎండోర్స్‌మెంట్‌ జారీ చేయించేశాడు. తీరా ఎస్‌డీసీ రికార్డులను పరిశీలిస్తే ఆ ఆర్‌-కార్డుకు అసలు ఎటువంటి ప్లాటూ కేటాయించలేదని స్పష్టంగా నమోదై ఉంది. రికార్డుల్లో ప్లాటే లేనప్పుడు ఏ ప్రాతిపదికన ఎండోర్స్‌మెంట్‌ ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అక్రమ వ్యవహారం వెనుక రూ.20 లక్షల ముడుపులే కీలక పాత్ర పోషించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

క్షేత్రస్థాయి రిపోర్టుకే దిక్కులేదు.. సూత్రధారి కనుసన్నల్లోనే ఎస్‌డీసీ ఎండోర్స్‌మెంట్‌!

వాస్తవానికి క్షేత్రస్థాయి పరిశీలనలో ఏం తేలిందనే అంశంపై ‘మేజర్‌ న్యూస్‌’ అప్పటి సర్వేయర్‌ హరీష్‌ను వివరణ కోరగా కీలక అంశాలు వెల్లడించారు. "తాము స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి.. అది లేఅవుట్‌ ప్లాట్‌ కాదని, కేవలం ‘మిగిలిన స్టీల్‌ప్లాంట్‌ భూమి’ అని స్పష్టంగా రాతపూర్వక నివేదిక ఇచ్చామని.. ఆ తర్వాత తాను బదిలీపై వెళ్లిపోవడంతో ఆ ఫైలుపై ఉన్నతాధికారులు ఏం చేశారో తనకేం తెలియదంటూ" ఆయన స్పష్టం చేశారు. సర్వేయర్‌ స్వయంగా ‘మిగిలిన భూమి’ అని తేల్చిచెప్పిన తర్వాత.. ఆ ఫైలును తెరవెనుక ఎవరు నడిపించారో, ఎలాంటి మతలబు చేశారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలు సర్వేయర్‌ ఇచ్చిన అధికారిక నివేదికను కాదని.. ఏ ప్రాతిపదికన, ఎవరి రిపోర్టు ఆధారంగా ఎస్‌డీసీ సునీత లేని ‘749ఏ’ ప్లాటుకు ఎండోర్స్‌మెంట్‌ జారీ చేశారన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది! సర్వేయర్‌ పక్కాగా గ్రౌండ్‌ రిపోర్టు ఇచ్చినా దాన్ని పక్కనపెట్టేసి, ఎస్‌డీసీ సునీత కళ్లు మూసుకుని సంతకం పెట్టేయడం వెనుక ప్రధాన సూత్రధారి సుధాకర్‌ నడిపించిన ముడుపుల బాగోతమే ఉందా? అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

​‘జేసీ ఆదేశాలే’ అంటూ ఎస్‌డీసీ సేఫ్‌ గేమ్‌.. అసలు నిజాలు తేలేనా?

ఈ మొత్తం వ్యవహారంలో బోగస్‌ ‘749ఏ’ ప్లాటుకు అసలు ఎండోర్స్‌మెంట్‌ ఎలా జారీ చేశారనే దానిపై ‘మేజర్‌ న్యూస్‌’ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సునీతను వివరణ కోరగా ఆమె చెప్పిన సమాధానం పలు అనుమానాలకు తావిస్తోంది. "అవునా! ఇది మా దగ్గర నుంచి కాలేదండి.. జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి దగ్గర నుంచే నోట్‌ ఆర్డర్లు వస్తే మేము సంతకం చేశాం తప్ప మాకేం తెలియదు" అంటూ బాధ్యతాయుతమైన అధికారి హోదాలో ఉండి కూడా నేరుగా ఉన్నతాధికారిపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. అయితే చేతులు మారినట్లు చెబుతున్న భారీ ముడుపులు నిజంగానే పైస్థాయికి వెళ్లాయా? లేక జేసీ పేరు అడ్డం పెట్టుకుని ఎస్‌డీసీ, ఆర్‌ఐలే తెరవెనుక ఈ కథ నడిపించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఒకవేళ ఈ అక్రమ వ్యవహారంతో జాయింట్ కలెక్టర్‌కు ఎటువంటి సంబంధం లేకపోతే.. ఉన్నతాధికారి పేరును వాడుకుంటూ విలువైన స్టీల్‌ప్లాంట్‌ భూములను అక్రమార్కులకు కట్టబెట్టిన ఎస్‌డీసీ సునీత, ఆర్‌ఐ అప్పారావులపై జేసీ ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అసలు నిజాలు ఎప్పటికి వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే!

 రిపోర్టర్ : కోటిరెడ్డి 

గాజువాక, విశాఖపట్నం జిల్లా