బంగారం పై రుణాలు అందించిన రౌతు నాగరాజు
ఆనందపురం, సూర్య : ఆనందపురం మండలం వేములవలసలోని శ్రీ పాండురంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బంగారు ఆభరణాలపై రుణాల పంపిణీ సేవలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రౌతు నాగరాజు మాట్లాడుతూ.. సొసైటీ పరిధిలోని ప్రజలకు బంగారు ఆభరణాలపై రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కోన తాతారావు, డీసీసీబీ సిబ్బంది సహకారంతో అవసరమైన అనుమతులు పొందిన అనంతరం ఈ సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రుణ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా వి. నాగేశ్వరరావుకు బంగారు ఆభరణాలపై మంజూరైన రూ.లక్ష రుణాన్ని బ్యాంకు అధ్యక్షుడు కోన తాతారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మేనేజర్ నాగలక్ష్మి, క్షేత్రస్థాయి అధికారి శ్రీనివాస్, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు దశావతారం, నారాయణరావు, జయరాం, సిబ్బంది అప్పలరాజు, రైతులు పాల్గొన్నారు.