బియ్యం నిలువలు,విక్రయాలపై కొత్త ఆంక్షలు.
రాష్ట్రంలో వరి, బియ్యం అక్రమ నిల్వలను అరికట్టడంతో పాటు మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కొత్త నియంత్రణ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వరి మరియు బియ్యం (నిల్వ పరిమితులు మరియు తప్పనిసరి నిల్వ వెల్లడి) నియంత్రణ ఉత్తర్వులు–2026ను జారీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. జీఓ ఎంఎస్ నంబర్ 18, తేదీ 20-11-2026 ద్వారా జారీ చేసిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంటాయని, 2027 జనవరి 31 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిబంధనలు వరి, బియ్యం కొనుగోలు, రవాణా, విక్రయాలు, పంపిణీ, నిల్వలు నిర్వహించే హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు, రైస్ మిల్లర్లు, ప్రాసెసర్లు, బల్క్ కన్స్యూమర్లు, కమిషన్ ఏజెంట్లు, ఎగుమతిదారులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఏ సమయంలోనైనా 10 క్వింటాళ్లకు మించి వరి లేదా బియ్యం నిల్వ ఉన్నా, రెండూ కలిపి 25 క్వింటాళ్లకు మించి నిల్వ ఉన్నా సంబంధిత వ్యాపారులు ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని, కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో సంస్థ పేరు, చిరునామా, యజమాని వివరాలు, జీఎస్టీ లేదా పాన్ నంబర్, మిల్లులు, గోదాముల చిరునామాలు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా నిర్దేశిత నిల్వ పరిమితులకు మించి నిల్వలు కలిగిన వ్యాపారులు తమ వద్ద ఉన్న వరి, బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ డీఎఫ్‌పీడీ వెబ్‌సైట్‌లో ఏడు రోజుల్లోగా నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రతి శుక్రవారం తాజా నిల్వల వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని తెలిపారు. బాస్మతి, నాన్ బాస్మతి ప్రీమియం, సాధారణ నాన్ బాస్మతి, ఉప్పుడు బియ్యం, నూకలు, వరి ధాన్యం ఇలా ఆరు రకాలుగా నిల్వలను విభజించి నమోదు చేయాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నిల్వల వివరాలను వెల్లడించకపోయినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన నిల్వ పరిమితుల ప్రకారం ట్రేడింగ్ రైస్ మిల్లర్లు గరిష్ఠంగా 4 వేల క్వింటాళ్లు లేదా ఏడు రోజుల మిల్లింగ్ సామర్థ్యం, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత పరిమాణంలో నిల్వలు ఉంచుకోవచ్చు. హోల్‌సేల్ వ్యాపారులు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,000 క్వింటాళ్లు, ఇతర జిల్లా కేంద్రాల్లో 500 క్వింటాళ్లు, మిగిలిన ప్రాంతాల్లో 250 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. రిటైల్ వ్యాపారులు పట్టణ ప్రాంతాల్లో 100 క్వింటాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 50 క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. బియ్యం విక్రయాల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ ధరలను తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకే రకం బియ్యాన్ని వేర్వేరు బ్రాండ్ల పేర్లతో అధిక ధరలకు విక్రయించడం, ప్యాకింగ్‌పై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేయడం వంటి అక్రమాలకు పాల్పడరాదన్నారు. రైతుల నుంచి కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేయడం, అనుమతించిన పరిమితులకు మించి నిల్వలు ఉంచడం, అధిక ధరలకు విక్రయించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే నిత్యావసర వస్తువుల చట్టం–1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పప్పుధాన్యాల ధరలను నియంత్రించి వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కందిపప్పు, మినపప్పు, శనగలు, మసూర్ పప్పు, పెసలు, పసుపు బఠానీల వ్యాపారులు తమ నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రతి శుక్రవారం తాజా వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా, నిల్వల వివరాలను వెల్లడించకపోయినా నిత్యావసర వస్తువుల చట్టం–1955, బ్లాక్ మార్కెటింగ్ నిరోధక చట్టం–1980 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో బియ్యం నిల్వలు, విక్రయాలు, ధరల అమలు, పప్పుధాన్యాల నిల్వలను పర్యవేక్షించేందుకు విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో సంయుక్త తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాపారులందరూ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పారదర్శకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.