బీసీల రుణం తీర్చుకుంటాం : సీఎం చంద్రబాబు
iఅమరావతి: వైఎస్సార్‌సీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ ప్రభుత్వంలో బీసీలకు కనీసం కమిషన్ కూడా వేయలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి అసలైన వెన్నుముక అని, "వెనుకబడిన వర్గాలంటే టీడీపీ.. టీడీపీ అంటేనే వెనుకబడిన వర్గాలు" అని ఆయన పునరుద్ఘాటించారు. బీసీల రుణం తీర్చుకోవాలనే తపన, అంకితభావం తనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్డీయే కూటమికి 57 శాతం ఓట్లు పడ్డాయని, అందులో బీసీ సోదరులందరూ ఏకపక్షంగా మద్దతు తెలిపారని సీఎం గుర్తుచేశారు. కూటమికి వచ్చిన ఈ భారీ ప్రజాదరణను చూసి వైఎస్సార్‌సీపీ నాయకుల వెన్నుముకలో వణుకు మొదలైందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టిస్తూ కోర్టులకు వెళ్లారని విమర్శించారు. "ఓటర్ జాబితా, సర్వేల పేరు చెప్పి ఎన్నికలను ఆపాలని చూస్తున్నారు.. కానీ రాబోయేది ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విపక్ష హెచ్చరికలు, అడ్డంకులపై స్పందిస్తూ — "ఇప్పుడున్నది 2014 చంద్రబాబు కాదు, 1995 చంద్రబాబు.. ఎవరు అడ్డుపడినా పక్కకు తోసి ముందుకుపోతాం" అని సీఎం స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి, పాలనను ఆటో పైలట్ మోడ్‌లోకి తీసుకెళ్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.