బాల్య వివాహాల నివారణ అందరి ఉమ్మడి బాధ్యత: డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్
గుంటూరు : బాల్య వివాహాల నిర్మూలనకు నవంబర్ 27, 2026 నుండి మార్చి 8, 2027 వరకు చేపట్టనున్న 100 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ ఛైర్మన్ బి. సాయి కల్యాణ చక్రవర్తి ఆదేశాల మేరకు సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ, బాల్య వివాహం అనేది కేవలం ఒక పెళ్లి సమస్య మాత్రమే కాదని, అది పిల్లల బాల్యాన్ని, చదువును, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుం దన్నారు. చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల ఆడపిల్లలకు గర్భధారణ సమయంలో తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, మగపిల్లల చదువు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2006 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం, సహకరించడం తీవ్రమైన నేరాలని స్పష్టం చేశారు.కేవలం చట్టాలు, పోలీసు లేదా మహిళా శిశు సంక్షేమ శాఖల వల్లే బాల్య వివాహాలు ఆగవని, ఇది ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని కార్యదర్శి పిలుపునిచ్చారు. గ్రామాల్లో బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తహసిల్దార్లు గ్రామస్థాయిలో ముందస్తు సమాచారం అంగన్వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు తమ పరిధిలోని కుటుంబాల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బడి మానేసిన పిల్లలను, ముఖ్యంగా బాలికలను గుర్తించి అందుకు గల కారణాలను ఆరా తీయాలి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.ఒక చిన్నారి బాల్యాన్ని కాపాడితే ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడినట్లేనని ఆయన పేర్కొన్నారు.జిల్లా బాలల పరిరక్షణ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వివిధ శాఖల బాధ్యతలను వివరించారు. డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో అవగాహన లోపం వల్లే ఇప్పటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. బాలల హక్కులు, పరిరక్షణ సంస్థ ప్రతినిధి ఫ్రాన్సిస్ తంబి నివారణలో తీసుకోవాల్సిన మెళకువలపై సూచనలు చేశారు.ఈ సదస్సులో పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య నాయక్