అర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని
అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలకు కేంద్ర సంస్థల సహకారాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ కారణంగా పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని వివరించారు. నష్టంపై సమగ్ర అంచనా వేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు..
తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 14 జిల్లాల్లో 16 జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), 11 రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదని సీఎం చంద్రబాబు వెల్లడించారు..
మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు సహా సుమారు 32 వేల మంది సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలను సమీక్షించారు. రహదారులపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని, ఈదురుగాలులు తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపట్టాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలకు కొరత లేకుండా చూడాలని సూచించారు.