అర్హులైన ప్రతి ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలి..జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మహేష్ కుమార్
అమలాపురం మేజర్ న్యూస్ :అర్హత కలిగిన ప్రతి ఓటరును ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు, అనర్హులైన పేర్లు జాబితాలో లేకుండా చూడటమే భారత ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. మహేష్ కుమార్ రవిరాల తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా అర్హులైన ఓటర్ల నమోదు, తొలగించబడిన ఓటర్ల వివరాల పునఃపరిశీలన కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
1,03,741 మంది ఓటర్లు చిరునామాల్లో అందుబాటులో లేరు2026 గణన దశలో భాగంగా బూత్ స్థాయి అధికారులు 15.06.2026 నుంచి 24.07.2026 వరకు ఇంటింటి సర్వే నిర్వహించారని కలెక్టర్ తెలిపారు. ఈ సర్వేలో మరణం, శాశ్వతంగా నివాసం మార్పు, బహుళ నమోదులు, ఆచూకీ లభించకపోవడం తదితర కారణాలతో 1,03,741 మంది ఓటర్లు తమ చిరునామాల్లో అందుబాటులో లేరని గుర్తించినట్లు వివరించారు.
అనంతరం అనర్హమైన నమోదులను పరిశీలించి తొలగించిన తరువాత, మొత్తం 12,11,266 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను 31.07.2026న ప్రచురించినట్లు తెలిపారు. నోటీసుల దశలో మరో 1,467 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు.అర్హులైన ఓటర్ల పేర్లపై ఇంటింటి పునఃపరిశీలన అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి విస్మరణకు గురికాకూడదనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.
ఇందులో భాగంగా BLOలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి, గతంలో తొలగించబడిన లేదా అనర్హులుగా గుర్తించిన ఓటర్ల ప్రస్తుత స్థితిని పునఃపరిశీలిస్తారని వివరించారు. అర్హత కలిగిన ఓటరు పేరు పొరపాటున తొలగించినట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యక్తి నుంచి ఫారం-6 దరఖాస్తు స్వీకరించి, అవసరమైన ధ్రువీకరణ అనంతరం నిరంతర నవీకరణ ప్రక్రియలో ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు
ఈ నెల 16న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన వ్యక్తులు నిరంతర నవీకరణ ప్రక్రియలో ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. తదుపరి అర్హత తేదీల నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కూడా నిబంధనల ప్రకారం ఫారం-6 ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలిఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండాలని, అనర్హుల పేర్లు కొనసాగకుండా చూడాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హులైన పౌరులు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకుని, పేరు లేనివారు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.