అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
మండపేట మేజర్ న్యూస్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 2,21,015 మంది ఓటర్లలో 16,603 మంది ఓటర్లను వివిధ కారణాలతో గుర్తించినట్లు మండపేట నియోజక వర్గం ఓటరు నమోదు అధికారి తంగెళ్ల రాజ రాజేశ్వరరావు తెలిపారు.ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో 8,407 మంది మరణించినవారు, 4,104 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు బదిలీ అయినవారు, 3,323 మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు కలిగినవారు 769 మంది ఆచూకీ లభించని వారుగా గుర్తించామన్నారు. వీరిని మినహాయించి మిగిలిన 2,04,412 మంది ఓటర్లతో 31.07.2026న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో సెక్టెంబర్ 8 నుంచి మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ లెవెల్ అధికారులు జాబితాలను ఇంటింటికీ వెళ్లి రీ-వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.ఈ పరిశీలనలో జాబితాల్లో అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉన్నట్లయితే, వారి నుంచి ఫారం-6 ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఓటరుగా నమోదు చేయించాల్సిందిగా బి ఎల్ ఓ లకు సూచించారు. అదేవిధంగా ప్రతి బూత్‌కు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి, ఏ ఎస్ డి డి జాబితాలను చదివి వినిపించి, అందులో అర్హులైన ఓటర్లు ఉన్నట్లయితే వారి ద్వారా ఫారం-6 దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు.అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ జాబితాలను పరిశీలించాలని కోరారు. జాబితాల్లో అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఓటు పునరుద్ధరణ కోసం వెంటనే ఫారం-6లో దరఖాస్తు చేయించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు