విద్యార్థులకు నాణ్యమైన విద్య
నేటి దినపత్రిక సూర్య బ్యూరో, రాజమహేంద్రవరం :లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ముందుగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వాసు భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న పరిమాణం తదితర అంశాలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి.. భోజనం ఎలా ఉంది..? ప్రతిరోజూ సక్రమంగా అందుతున్నదా..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమకు సంబంధించిన సమస్యలు, అవసరాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. విద్యార్థుల చదువుపై కూడా ఆరా తీసి, వారు ఏయే సబ్జెక్టుల్లో ఆసక్తి చూపుతున్నారు, పాఠశాలలో విద్యా బోధన ఎలా కొనసాగుతోంది అనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో పాఠశాలలో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.