అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే .. నేటి నుండి పాలకొండ లో దసరా ఉత్సవాలు
పాలకొండ, సూర్య : రాజుల ఇల వేల్పుగా పూజలందుకుని కోటలో కొలువుదీరిన కోట దుర్గమ్మ రాజులు అంతరించి కోట శిథిలం కావడంతో ప్రజలందరికీ కోట దుర్గమ్మగా దర్శనమిస్తూ ఉత్తరాంధ్రా దైవంగా వెలుగొంది భక్తుల కోర్కెలను తీరుస్తూ దిన దినాభివద్ధి చెందుతున్న పాలకొండ కోట దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల అక్టోబర్ 11వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు అతి వైభవంగా జరిపించడానికి దేవాదాయ శాఖాధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తరాంధ్రా ఆరాధ్యదైవంగా పేరొంది పాలకొండ పట్టణంలో వెలసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల మొదలు ఆలకించే కల్పవల్లి శ్రీ కోట దుర్గమ్మ తల్లి మహిమ గల తల్లి. మాతలకు మాత మా అమ్మ దుర్గమ్మ పాలకొండ పట్టణం నడిబొడ్డులో కోట దుర్గగా వెలసి నిత్య పూజలందుకుంటూ తన బిడ్డలయిన భక్తులను కంటికి రెప్పలా నిత్యం కాపాడుతూ వారికి ఆయురారోగ్యాలతో పాటు ధన కనక వస్తువులను ప్రసాదిస్తూ నిత్యం ఆనందంగా ఉండేలా దీవిస్తుంది. పట్టణంలో నాలుగు తోవల మధ్య కోటి సూర్య కాంతులతో అనంత కోటి చందమామల చలువ శ్రీలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలకొండ కోట దుర్గమ్మగా పేరు గాంచింది. ఆ తల్లి చరిత్ర చదివినా, విన్నా సత్సంతానం, సమస్త సంపదలతో పాటు మానసిక శాంతి చేకూరుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం.. సింహాసనంపై ఎనిమిది చేతులు ఉన్న శ్రీ కోట దుర్గమ్మ నిజ రూప దర్శనం. ఏడాదికొకసారి మాత్రమే నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తపు రాట వేసిన రోజున ఆదివారం కొన్ని గంటలు మాత్రమే లభిస్తుంది. ఈ రోజు నుండి నవరాత్రులలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక కుంకును పూజలు విజయ దశమి వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 11 ఆదివారం నుండి 20వ తేదీ మంగళవారం వారం వరకు ఘనంగా కన్నుల పండవుగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖాధికారులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు స్థానిక పోలీస్ యంత్రాంగంకు సహకారం అందిస్తున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీకోట దుర్గమ్మ తల్లి చరిత్రలో రాజుల ఇలవేల్పుగా పూజలందుకున్న నేడు ఉత్తరాంధ్రా ప్రజల పాలిట ఇష్టదైవంగా మారింది. అమ్మవారికి దివ్యజ్యోతులు వెలిగించడం, సంబరాలు జరపడం ఇక్కడ గ్రామీణ సంస్కృతిలో భాగమైంది. నవరాత్రులు. ప్రారంభమైన నాటి నుండి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు అమ్మవారికి సంబరాలు చేయడం పరిపాటిగా మారింది. నవరాత్రుల ముగింపు రోజున విజయదశమి రోజున భక్తులందరూ ఆనందంగా విజయులుగా ఉండాలని పట్టణ పురవీధులలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజయ దశమి కావడంతో ప్రతీ ఒక్కరు తమ యొక్క వాహనాలకు, తమకు జీవనాధారమైన వత్తులకు ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆరోజు తిరువీధిలో ఏర్పాటు చేసిన బళ్ల వేషాలలో వివిధ కళారూపాలకు రంగ స్థల నటులకు ఈ వేదిక లభించడం తమ అదృష్టం భావిస్తారు . ఆరోజు వివిధ జానపద బళ్ల వేషాలతో పాటు సాముగరిడీలు, జమీందారిని జ్ఞాపకం చేసుకుని సవర నత్యాలు కూడా ఉంటాయి. ఆ రోజు అమ్మవారి తిరువీధిని తిలకించడానికి ఆంధ్రా, ఒడిషా రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశాలలో సైతం స్థిరపడిన తెలుగువారు సైతం విచ్చేస్తారు.
తొలిరోజే నిజ రూపదర్శనం : దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తపు రాట వేసిన తొలి రోజైన ఆదివారం (అక్టోబర్ 11) నాడు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనం ఏడాదికొకసారి మాత్రమే లభిస్తుంది. ఇందు కోసం డివిజన్లో మండలాల్లోని భక్తులు అమ్మవారి నిజ రూప దర్శనాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో వస్తారు. ఇందుకు తగ్గట్టుగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహానాధికారి వి. వి. సూర్యనారాయణ తెలిపారు. నిజరూప దర్శనం రోజున అక్కడ పలు స్వచ్చంద సేవకులతో పాటు సత్యసాయి భక్తులు సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే భక్తుల అవసరమైన మౌళిక సదుపాయాలతో పాటు దాహార్తిని తీర్చుకొనుటకు మినరల్ వాటర్ ప్యాకెట్లను కొందరు భక్తులు సరఫరా చేస్తారు. అయితే అమ్మవారి నిజరూప దర్శనం రోజున మాత్రం ఎటువంటి ఘటాలు, సంబరాలు నిర్వహించరాదని.. దేవాదాయ శాఖ భక్తులను సూచించింది.
నవరాత్రులకు భారీ ఏర్పాట్లు... గట్టి పోలీస్ బందోబస్తు : అమ్మవారి దసరా ఉత్సవాలలో భాగంగా భారీ ఏర్పాట్లను దేవాదాయ శాఖ చేసింది. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్య అతిధులు, ప్రముఖులు ప్రత్యేక దర్శనానికి కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ నవరాత్రిలో భాగంగా ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ శరన్నవరాత్రి వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు, ఎస్ఐ వెంకన్న తన సిబ్బందితో పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు దేవాదాయాధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే ఈ వేడుకలలో పలు స్వచ్చంద సంస్థలతో పాటు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భక్తులకు తమ సేవలనందించుటకు సిద్ధమయ్యారు.
భక్తుల పాలిట కల్పవల్లి నీలమమ్మ తల్లి, పురటాల పోలమ్మలు:
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలో దశాబ్దాల చరిత్ర ఉన్న నీలమ్మ తల్లి, పురటాల పాలన్ము ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం పట్టణ ప్రజల ఆనవాయితీ, నీలమ్మ కాలనీలో వేంచేసి యున్న నీలమ్మ తల్లి భక్తుల కోర్కెలు.. తీర్చే కల్పవల్లిగా పేరు పొంది దసరా ఉత్సవాలకు సిద్ధం చేశారు. అక్కడి నిర్వాహకులు, అలాగే స్థానిక నాగవంశపు వీధి కూడలిలో వేంచేసి యున్న పురటాల పోలమ్మ ఉత్సవాలను ఈ దసరా నవరాత్రులలో అక్కడ ఉన్న ప్రజలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రా ఆరాధ్య దైవమైన శ్రీ కోట దుర్గమ్మ దసరా నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పట్టణంలో వేంచేసియున్న నీలమ్మ తల్లి, పురటాల పోలమ్మ దేవతలను పూజించడం పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమని ఇక్కడ ప్రజలలో ప్రగాఢ నమ్మకం ఉంది. పట్టణంలో ఎటువంటి శుభ కార్యాలు చేపట్టినా ఈ అమ్మవార్లను పూజించకుండా ఏ ఒక్క పని తలపెట్టరు. నిత్యం తమను కాపాడి ప్రజలలో అమిత భక్తి భావాలను కల్పించిన ఈ ముగ్గురు అమ్మలను ఈ దసరా వేడుకలలో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిధ్ధిస్తూ ప్రతీ ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటుంటారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.