అండు కొర్ర సాగుతో అధిక దిగుబడులు నర్లాపురం, అల్లుగుండు గ్రామాల్లో పొలంబడి కార్యక్రమం
వెల్దుర్తి మేజర్ న్యూస్ : మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి అండు కొర్ర పంట సాగు చేయడం ద్వారా రైతులకు అధిక దిగుబడులు వస్తాయని డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం వెల్దుర్తి మండలం నార్లాపురం గ్రామంలో అండు కొర్ర పంటపై ‘గ్యాప్’ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు విచక్షణారహితంగా ఎరువులు, పురుగుమందులు వాడకూడదని సూచించారు. పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ మోతాదులో రసాయనాలు వాడటం వల్ల నాణ్యమైన దిగుబడి సాధించవచ్చన్నారు. ఇండి గ్యాప్ పథకం కింద సాగుచేసిన అండు కొర్ర పంటలో ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.అనంతరం అల్లుగుండు, నార్లాపురం గ్రామాల్లో 'ఖేతీ బచావో' కార్యక్రమం నిర్వహించారు. అల్లుగుండులో మిషన్ ఫర్ ఆత్మనిర్భరత పథకం కింద సాగు చేసిన కంది (ఎల్.ఆర్.జి 105) విత్తన ప్రదర్శన క్షేత్రాన్ని పరిశీలించి, పైరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సలహాలు, సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో DRC కర్నూలు ఏఓ రంగారెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఆర్. అక్బర్ బాషా, ఏఈఓలు అజయ్ భార్గవ్, సంధ్యారాణి, రైతు సేవా కేంద్రం సిబ్బంది శ్రీకాంత్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.