ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ భాగస్వామ్య సదస్సు నూతన దిశ – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖపట్నం, మేజర్‌న్యూస్ :
సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి నూతన దిశను చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదికగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం దెబ్బతిందని, పెట్టుబడిదారుల్లో ఏర్పడిన అపనమ్మకాన్ని తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయడం, మౌలిక వసతులు మెరుగుపరచడం, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 'ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్' నినాదంతో ప్రపంచ పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని, విశాఖపట్నం వంటి పారిశ్రామిక నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, నౌకాశ్రయాలు, రవాణా సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఆహారశుద్ధి యూనిట్లు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను పెంచవచ్చని పేర్కొన్నారు. నేటి సదస్సుతో కాలంలో రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశ, విదేశీ పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపుతున్నాయని, పెట్టుబడుల ప్రతిపాదనలను వాస్తవ పరిశ్రమలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా మరిన్ని పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని తెలిపారు. పరిశ్రమలు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం ముఖ్యమన్నారు.పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే నిజమైన పారిశ్రామికాభివృద్ధి అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, యువత నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పారిశ్రామికాభివృద్ధితో రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక పురోగతికి సీఐఐ భాగస్వామ్య సదస్సు ఉపయోగపడుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.