అమలాపురం మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ సమాయత్తం..
అమలాపురం మేజర్ న్యూస్ రానున్న అమలాపురం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన భట్నవిల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద మున్సిపల్ మాజీ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ ప్రజల్లో తమ పార్టీ వాదనలను వివరించాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, వార్డులవారీగా రాజకీయ పరిస్థితులను సమీక్షించడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్ , రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి చోల్లంగి సుబ్బురాం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యదర్శులు గొవ్వల రాజేష్, సుంకర సుధతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.