అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ పాలన
సూర్య అమలాపురం మేజర్ న్యూస్ : అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ కేంద్ర, రాష్ట్రాల్లోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం ఆదర్శవంతమైన సుపరిపాలనను అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బలమైన నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
బీజేపీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రధాని నాయకత్వంపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని పవన్ కుమార్ తెలిపారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు బీజేపీ నేతలపై రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య పాలనను అందిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయేనని తేల్చిచెప్పారు.
ఓటర్ల జాబితా వ్యవహారంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. జాబితా నుంచి పొరపాటున తొలగించిన ఓట్లను తిరిగి నమోదు చేసే ప్రక్రియ నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనసాగుతున్నప్పటికీ, వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బురదజల్లే రాజకీయాలు చేస్తోందని, ప్రజలు ఆ పార్టీ వైఖరిని గమనిస్తున్నారని నల్లా పవన్ కుమార్ హెచ్చరించారు.