ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల, మేజర్‌న్యూస్ :బాపట్ల జిల్లాలో ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాను కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అన్నారు. సోమవారం, కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలు నందు ఆర్నాబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీర్చుకున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై కలెక్టర్ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడుతూ, జిల్లాలో 27, 28 తేదీలలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ తుఫాను 28వ తేదీ బాపట్ల మరియు విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిందన్నారు. తీరం దాటేటప్పుడు ఆయా ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలియజేసిందని అన్నారు. తుఫాను ప్రభావం పై తీసుకోవాల్సిన చర్యల విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీక్షణ సమావేశం ద్వారా సూచనలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు మరియు ఎల్లుండి జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపిందని ఆయన చెప్పారు.
కృష్ణా నది పరివాహక ప్రాంతం కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, రేపల్లె, నిజాంపట్నం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ఈ మండలాలలో 110 మిల్లీమీటర్ల,చుండూరు, అమర్తలూరు, నగరం, చెరుకుపల్లి మండలాలలో 60 నుండి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. తుఫాను ప్రభావం పై ప్రతి 3 గంటలకు ఒకసారి వివరాలు అందజేయబడతాయని ఆయన చెప్పారు. తుఫాను ప్రభావం పై తీసుకోవాల్సిన చర్యల విషయమై జిల్లా అధికారులతో మరియు మండల అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
తుఫాను ప్రభావం వలన ముఖ్యంగా చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. అందుకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు మొదలగు విద్యుత్ పరికరాలను, సిబ్బందిని సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాకు రాయలసీమ ఎస్పీడీసీఎల్ నుండి సహకారం అందుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల వాహనాలను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. తుఫాను ప్రభావాన్ని తట్టుకునేందుకు అన్ని రకాల వ్యవస్థలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఒక సాంకేతిక విపత్తు కింద ప్రభుత్వం ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ముందుగా తెలిపారన్నారు. సంఘటన నిర్వహణ వ్యవస్థ ద్వారా ఆన్లైన్లో 22 శాఖలలో ఉన్న పరికరాలు వివరాలను నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
సచివాలయం పరిధి అనేది ఒక పరిపాలన యూనిట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి స్థానికంగా జరిగిన సంఘటనలను, పరిస్థితులను పర్యవేక్షిస్తారని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలోని పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని ఏర్పాట్లతో పాటు జిల్లా పోలీస్, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ లతో సమన్వయం చేసుకుంటూ, కోస్టల్ గార్డ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రైల్వే అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఎస్ ఓ పి ప్రకారం అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో గర్భవతుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచనలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ వారంలో ప్రసవం అయ్యే వారి వివరాల మేరకు వారిని పి.హెచ్.సి, సి.హెచ్ సి, ఏరియా లేదా జిల్లా ఆసుపత్రుల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించినట్లు చెప్పారు.
ప్రజలు అవసరం మేరకే ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. వర్షం పడేటప్పుడు ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించవద్దని ఆయన ప్రజలను కోరారు. కరెంటు లేని సమయంలో టార్చిలైట్లను వాడాలన్నారు. జిల్లాలోని ప్రతి ఎఫ్ పి షాపుల్లో సరుకులు అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. ప్రజలకు కావలసిన మందులను అన్ని ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలో మరియు డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలన్నారు.
జిల్లాలో నిజాంపట్నం నుండి చీరాల వరకు 80 కిలోమీటర్ల మేరా తీర ప్రాంతం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. తీర ప్రాంతాల్లో పెద్ద పెద్ద అలలు రావచ్చని అక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదని ఆయన తెలిపారు. తీర ప్రాంతంలో ఎక్కువగా గాలి, వర్షాభావం ఉంటుందని ఆయన తెలిపారు. పై ప్రాంతాలలో కురిసిన వర్షం కారణంగా కృష్ణా నదిలో ప్రవాహం పెరిగే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. కృష్ణానది ఆనుకుని ఉన్న గ్రామాలు, మండలాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల నుండి వర్షపు నీరు సముద్రంలో కలిపే ముఖ్యమైన ప్రధాన కాలువలు జిల్లాలో ఉండుటవలన తుఫాను ఆగిన తర్వాత కూడా వర్షపు నీరు దాదాపు 4 లేక 5 రోజులు కాలువ ద్వారా ప్రవహిస్తుందని ఆయన చెప్పారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారికి జిల్లా యంత్రాంగం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి వారితోపాటు ఇన్చార్జి జిల్లా రెవిన్యూ అధికారి లవన్న పాల్గొన్నారు.